Friday 1 August 2014

.tel.story."reservation"-read, understand and entertain the soul "రిజర్వేషన్"-కధానిక-భట్ సాధన


.tel.story."reservation"-read, understand and entertain the soul   "రిజర్వేషన్"కధానిక- భట్ సాధన




బస్ వచ్చేసింది.అంతవరకు ఎవరి గొడవలో వాళ్ళువున్న ప్రయాణీకులు ,వాళ్ళని సాగనంపటానికి వచ్చిన వాళ్ళు తమ నీతీ,నియమం వెరసి డిసిప్లైన్ అన్నీ దేవుడికి,ప్రభుత్వానికి వదిలేసి,హడావిడి పడిపోయారు. బస్ డోరు ఓపెన్ చేయడం:దిగుతున్నవాళ్ళు,-
"యెక్కేద్దాం,యెక్కేసి,సీట్లు ఆక్రమించుకుందాం"-అనుకుంటున్నవాళ్ళను చిరాకుగా చూస్తూ,-'చేతుల్లోని బరువు కళ్ళుమోస్తున్నంత'-బాధని వ్యక్తం చేస్తూ,కిందకు అడుగులు వేస్తున్నారు.వాళ్ళు దిగటమే  :'తమ ఆటోలలో యెక్కి ఊరేగటానికి '-అన్నట్టు, వేరే వాళ్ల గొఢవ. చిట్టచివరిగా దిగుతున్న వాళ్ళు రాజసంగా అతి లేటుగా దిగుతున్నారనిపిస్తుంది.యెక్కేవాళ్ళు అందరూ కలిసి,వాళ్ళను దిగనివ్వకుండా-





'యెటేటైమ్'-బాధపడి, బాధ పెట్టేస్తున్నారు.
కిటికీలదగ్గర వేళ్ళాడటం,టైర్లు యెక్కి,'లగేజీ' సర్దుడు;లోపలకు బాగ్గులూ,కర్చీఫులూ ఇంకా యేవేవో అందిస్తూ,-ఓమూల దిగుతూవున్నవాళ్ళ చేత 'ప్రజాస్వామ్య రిజర్వేషన్స్'-చేయించుకుంటున్నవాళ్ళు మరోవేపు.
పాప్కార్న్,బిస్కెట్ పాకెట్స్ అమ్ముకుంటున్నవాళ్ళు దర్జాగా అందర్నీ బెదిరిస్తూ, వాళ్ళపని వాళ్ళు చేసుకుంటున్నారు."ఆడమనిషికి దారి వదలండయ్యా "-అంటూ;




"కండక్టర్ తను టిక్కెట్లు ఇచ్చే డ్యూటీ చేసేసుకోక, యేమిటీ అలా ఊరికే కూర్చుంటాడూ?డ్రైవర్ ఇంకా రాడేమిటీ?"-ఇలాంటి కామెంట్స్ సీటు సపాదించుకు కూచున్న వాళ్ళ నోటివెంట.ఇక సీటుదొరకని నాలాంటి వాళ్ళ గొడవే వేరు.ము0దుసీట్లో యేదోగొడవ...




ఒకడు వేసుకున్న 'కర్చీఫు రిజర్వేషన్' ని వేరే మనిషి రద్దు చేసేసి,-అంటే దాన్ని కిందపారేస్సి, తను అక్కడ కూర్చున్నాడట..."డామిట్ కధ మొదలైంది"-అనుకున్నారు నాబోటి 'గురుజాడల్లో'... నడుద్దాం అనుకునే వాళ్ళు. పైగా తనే కర్చీఫ్ తీసి యిచ్చి;                                     




"నోర్మూసుకుని,వెనక యేదైనా సీట్లో సేఫుగా కూర్చోవైయ్యా! వెధవ కర్చీఫ్ రిజర్వేషన్ నువ్వూనూ..."-అంటున్నాడు తాపీగాకూర్చున్న పెద్దమనిషి.
'అనాధరైజుడు అండ్ అన్ గెజిటెడ్ రిజర్వేషన్' అకస్మాత్తుగా ఫెయిలై పోయిందని, మండిపోతున్న బాధితుడు-
"నువ్వే నోర్మూయి, బోడి ఉచిత సలహా నువ్వూనూ, గోటూహెల్; అంతలావుగా ఉన్నావ్,లారీ మీద స్పెషల్ గా పోరాదా,"-
అని యింకో సముచిత సలహా గిరాట్టేస్సి, నా వెనగ్గా దూరి నుంచున్నాడు పాపం ఆయన ఏమీ చేత కాక.



పుణ్య క్షేత్రాలకి వెళ్ళొచ్చిన కొన్ని తలలు తమ పాత నిండు క్రాఫులు గుర్తుకు తెచ్చుకున్నాయి.
"చిల్లర లేకపోతే దిగిపోమ్మా. యివ్వాళ రేపు ప్రతివాడూ వంద నోట్లు ప్రింటు చేసేయడమే, అవి కర్చు పెట్టడానికి బస్సులెక్కి మాప్రాణాలు తీసేయడమే."-అని తన రియల్ డ్యూటీ మంత్రాలు మొదలు పెట్టాడు కండక్టరు.
"నిల్చున్న వాళ్ళందరికీ రెండ్రెండు రూపాయలు రిబేటు యిస్తే బాగుండును"-అంటున్నాడు నాముందు అటుకులు నములుతున్న ఆసామి.
డ్రయివరుకి యెడమ వైపుగా వున్న సీట్లో కూర్చోవడం ఒక 'రాజయోగం' :అని యెవరికి అనిపించదు చెప్పండీ.హాయిగా రోడ్డు చూస్తూ, ఊహల్లో తేలుతూ, డ్రయివర్ గొప్పతనం చూస్తూ బహుశా వీలైతే 'పరిచయం పెంచుకుంటూ…'; చీటికీ మాటికీ దిగుతూ అదంతా గ్రేట్ స్పెషాలిటీ!
నాకూ సీటంటే వల్లమాలిన 





అభిమానం.న్యూటన్,ఐనిస్టీన్ పిజిక్సు సూత్రాలని యమ రీసర్చ్ చేయచ్చు. అక్కడ కూర్చుంటే ... చాలా పెట్టి పుట్టాలి... అక్కడికి చేరుకోవాలంటే... అసలు సగటు ప్రయాణీకుడికి సీటు యంపీ సేటు కన్నా చాలా విలువైనది.






బస్సు బయలుదేరి చాలాసేపైంది. సీట్లు దొరికిన వాళ్ళు వివిధ విన్యాసాలలో లెక్చర్లలో మునిగి తేలుతున్నారు.నాకు సీటు దొరికి వుంటే, యీపాటికి సగమన్నా క్రాస్ వర్డ్ ఫజిలు పూర్తి చేసి వుండేవాడిని కదూ.
"యింత అడ్డంగా చిరిగిన నోటు , నా బావమరిది యిచ్చినా తీసుకోను."-అంటున్నాడు బొత్తిగా కండలు లేని కండక్టరు నాముందు,  ఏమీ చేత కాక కిందే కూలపడ్డ మూటల మహాలక్ష్మితో.
గుర్తు తెచ్చుకుని మరిట్టే నవ్వుముఖం పెట్టాను.ఊరుపేరు చెప్పి, టిక్కెట్టైతే తీసుకున్నాను. భయపడ్డంతా అయ్యింది. మొహమాటం లేకుండా, రూపాయ్ తక్కువగా చిల్లర యిచ్చేశాడు కండక్టరు.శ్రీమాన్ ఆర్టీసీ వారు ఆశీర్వదించిన 'ఇన్విజిబుల్ టాక్స్' రూపాయ్.
అప్రయత్నంగా అనుకోకుండా నేను నుంచున్న పక్కన రెండు సీట్లు ఖాళీ అయ్యాయి. నేనూ, కర్చీఫ్ పెద్ద మనిషీ యెల్లాగైతే కూలపడ్డాం. ఆయనకు కిటికీ పక్క సీటు 'మెర్సీ రిజర్వేషన్' కింద వదిలేశా.   
ఆయన నేనూ యెంచక్కా కబుర్లలో పడిపోయాం. యిరుకు, మురికీ, బురద, చీకటి రాజకీయాల గురించి, కులాల రిజర్వేషన్స్, ముఠాల ప్రిజర్వేషన్స్, మతాల కన్సర్వేషన్స్ గురించీ;
వెనుక కూర్చున్న వాళ్ళూ 'రికామీ'గా  గొణుగుక్కుంటున్నారు. ధరల మీదా, 'స్కీముల చాపల కింద స్కాముల' మీదా, స్వాముల ఆశ్రమాల అక్రమ ఆస్తుల మీదా, నడిచిపోతున్నాయి: సెటైర్లూ- రియాక్టివ్ సెటైర్లూ.
బస్సు స్పీడు పెరిగింది. ఇటునుంచీ, అటునుంచీ లారీలని, యెడ్ల బళ్ళనీ దాటేస్తూ, దూసుకుపోతోంది. చాలా మంది 50% 'నిద్ర లాంటి రెస్టు' తీసుకుంటున్నారు ప్రయాణీకం. అల్లాంటి రెస్టే తీసుకుంటూ బస్సు నడుపుతున్న డ్రైవరు అదెదో వంతెన దగ్గర, బ్రేకే అనుకుంటా వేశాడు మొత్తానికి.








ఇంతకీ యెదురుగా వస్తూన్న లారీ డ్రైవర్ కూడా అదే సమయంలో అచ్చంగా బ్రేకు లాంటిదే వేశాడట. కానీ మంత్రం పారలేదు.
దెబ్బకు అందరూ 'ఇహలోకం' లోకి వచ్చేశారు. బాగా శబ్దం అయ్యింది. అదేమంటే తప్పనిసరి పరీస్థితిలో 'ఇచ్చి పుచ్చుకున్న' డాషింగన్నమాట. ఓకే!అదృశ్య లెక్కల మాస్టరు బస్సు లోకి దూసుకొచ్చినట్లుగా: అందరికీ బాగా దెబ్బలైతే తగిలాయి. బుడ్డిపిల్లల వాంఙ్మయాన్ని అనుసరించి, బాగా 'తలిగాయి' మరి. అరుపులూ, హాహాకారాలూ; యేడుపులూ, గాజుపెంకులూ, రక్తం; స్పృహ లోకి వస్తేగానీ నాకర్ధం కాలేదు;ఓహో ఐతే ఒకానొక 'యాక్సిడెంటు' అయ్యిందన్న మాట.  



   

ఐతే డ్రైవర్ కి మట్టుకూ డాష్ ఇచ్చే ముందే చాలా సార్లలాగే గుర్తుకొచ్చారు తన  భార్యా, తల్లీ, చెల్లీ, పిల్లా. అందుకే డాష్ యిచ్చే ముందు చాలా మటుకు రైట్ టర్న్ యిచ్చేశాడు.దానివల్ల బస్సు లెఫ్ట్ పార్ట్ 'సర్వతుక్కు' అయిపోయింది. నా పక్కన కూర్చున్న కర్చీఫ్ పెద్ద మనిషి స్పృహలోలేడు. ఆయన కర్చీఫ్ ని తొలగించి ,తగవులాడి,తొందరపడి రిజర్వేషన్ చెసుకున్న వాడికి  మటుకూ  బతుకు అంతం అయిపోయింది.పచ్చడై, లయం అయిపోయాడు. మిగతా అందరూ కొద్దిపాటి గాయాలతో, గుండెల నిండా భయాలతో ప్రయాణం లోంచి వచ్చిన ప్రమాదం నుంచి గట్టెక్కాం. శవం దాని పార్టులు శ్రధ్ధగా అంబులెన్సు దొరక్క లారీ లోకి యెక్కించారు.
బహూశా లేక సుమారు రెండు గంటల తరువాత, అస్సలు పరిచయం లేని: హాస్పిటల్ లో,నేను కళ్ళు తెరిచిన కాస్సేపటికి; కొన్ని బెడ్స్ దగ్గర యేడుపులు అంటే: వాళ్ళు 'వెళ్ళిపోయి'నట్టున్నారు. నేను కర్చీఫు పెద్ద మనిషిని గుర్తించగలిగాను.








"చుశరా! ఆయనది సహజమైన రిజర్వేషన్; మీది ఒట్టి 'కర్చీఫ్ రిజర్వేషన్'; ఆయన 'చేసుకున్న  దానిలో...'  మీరు కూర్చుంటానంటే ఆయన ఊరుకుంటాడా చెప్పండీ.ఆయన అన్న మాటలు గుర్తున్నయా...?!"
ఆయన చటుక్కున లేచి   కూర్చుని, కన్నీళ్ళతో:
" గుర్తున్నాయి; నోరు మూసుకోని,-' వెనక ఏదైన చోటు చూసుకొని సేఫుగా కూర్చోవోయ్; వెధవ కర్చీఫ్ రెజర్వేషన్ నువ్వూనూ...' అని ఆశీర్వదించాడు మహనుభావుడు;"




తరువాత ఆయన అంత్యక్రియలకి కూడా హాజర్ అయ్యాము.అప్పుడు-అదే కర్చీఫుతో నుదురు, ముఖం, మెడ అద్దుకుంటూ...కన్నీళ్ళు తుడుచుకుంటూ...లేచి నుంచుని, దణ్ణం పెట్టుకుంటూ ఆవేశంగా ఇలా అన్నాడు.
"ప్రతిరోజూ నిద్ర లేస్తునే, బ్రతికున్నన్నాళ్ళు దణ్ణం పెట్టుకుంటాను మహాత్ముడికి..."-








                                  @@@